మండపేట, న్యూస్‌లైన్: ఈనిక సమయంలో తలెత్తే సమస్యల వల్లనైతేనేమి, పాడిరైతులు అవగాహన లోపంతో చేస్తున్న పొరపాట్ల వల్లనైతేనేమి ఐదు శాతం దూడలు పశువుల ఈనిక సమయంలోనే చనిపోతున్నాయి.
ఫలితంగా రేపటి పాడి పశువులను కోల్పోవడమే
కాకుండా తల్లి పశువు దుఃఖంలో ఉండి పాలను సరిగా ఇవ్వకపోవడం
వల్ల రైతులు పాల దిగుబడినీ కోల్పోతున్నారంటున్నారు మండపేటలోని రాష్ట్ర పశుసంవర్ధక శిక్షణ కేంద్రం అసిస్టెంట్ డెరైక్టర్ ఎంఏ గంగాధర్. పాడిపశువుల ఈనిక సమయంలో చోటుచేసుకునే మార్పులు, సమస్యలు రాకుండా రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆయన మాటల్లోనే...
ఈనిక సమయంలో జరిగే మార్పులు
ఈనిక ప్రక్రియ మూడు దశల్లో జరుగుతుంది.
మొదటి దశలో గర్భకోశ ముఖద్వారం విచ్చుకుని
దూడను బయటకు పంపడానికి వీలుగా తెరచుకుంటుంది.
ఈ దశ సుమారు 2 నుంచి 6 గంటల పాటు ఉంటుంది. తర్వాత దశలో ఉమ్మనీరు బయటపడి దూడ వచ్చే మార్గంలో తడిగా (లూబ్రికేషన్) మారుతుంది.
అదే సమయంలో గర్భంలో కలిగే కదలికల వల్ల దూడ సులభంగా బయటపడుతుంది. ఇది సుమారు 20-30 నిమిషాల వ్యవధిలో జరుగుతుంది.
ఉమ్మనీరు వచ్చిన సమయం నుంచి రెండు గంటలలోపు దూడ బయటికి రానట్లయితే పశువైద్యున్ని సంప్రదించాలి.
మూడవ దశలో మాయపొరలు బయటపడతాయి. దూడ బయటపడినప్పటినుంచి సుమారు 8-12 గంటలు సమయం పట్టవచ్చు.
చాలా పశువుల్లో
ఈనిన 30 నిమిషాలలోపే
మాయలు పడిపోతూ ఉంటాయి.
దూడపాటు సరిగా ఉండటం అంటే...
పుట్టే సమయానికి గర్భకోశంలో దూడ తలభాగం, దానితోపాటు ముందు కాళ్లు రెండూ చెరోవైపునా చక్కగా ఉండాలి. అలాగే దూడ వెన్ను తల్లి వెన్నుకు కిందగా ఉండాలి. ఇలా దూడ సరైన పాటులో ఉన్నట్లయితే ఈనిక సమయంలో ఎలాంటి సమస్యలు రావు. ఒక్కొక్కసారి దూడ తల వెనుక ఉండి వెనుక కాళ్లు, తోక ముందుగా బయటకు వచ్చేవిధంగా ఉంటుంది. మరి కొన్నిసార్లు తల ముందుకే ఉన్నా సవ్యంగా ఉండకుండా మెలికతిరిగి ఉండటం లాంటి సమస్యలు వస్తాయి. ఇలాంటి సందర్భాల్లో తల్లి పశువు దూడను ఈనలేక, గర్భకోశంలోనే దూడ చనిపోతుంది.
ఇతర సమస్యల వల్లా ఆలస్యం
దూడ ఉండాల్సిన
దాని కంటే పెద్దిదిగా ఉండటం, మలుగు సరిగా సాగి ఉండకపోవడం,
మలుగులోని ఎముకలు దెబ్బతిన్న కారణంగా ముడుచుకుపోవడం
వల్లనైతేనేమి, ఈనడానికి గర్భకోశంలో రావాల్సిన సంకోచాలు సక్రమంగా, కావలసినంత బలంగా రాకపోవడం వల్ల కూడా దూడలు బయటకు రాలేక చనిపోతుంటాయి. కొన్నిసార్లు గర్భ సంచి మెలితిరిగి ఉండటం వంటి సమస్యలు ఉండి, పశువు ఎంతగా ప్రయత్నించినప్పటికీ ఈనలేకపోవడం, గర్భంలోని
దూడలు చనిపోవడంతో
పాటు ఈనలేక అలసిసొమ్మసిల్లిపోయి తల్లికూడా
మరణిస్తుంది.
ఇలాంటి సమస్యలు ఆడదూడల కంటే మగదూడలను ఈనే సమయంలో ఎక్కువగా ఉంటున్నట్లు పరిశీలనల్లో వెల్లడైంది.
దూడలు చాలా పెద్దవిగా ఉండటం, దూడలో అవయవాలు సరిగా పెరగకపోవడం
వల్ల వచ్చే వికృతాల వల్ల కూడా దూడలు, తల్లుల మరణాలు సంభవిస్తుంటాయి. ఒక్కోసారి దూడలు ఉమ్మనీరు తాగడం వల్ల కడుపు భాగం విపరీతంగా
ఉబ్బిపోయి పశువు ఈనే సమయంలో సమస్యలు వస్తుంటాయి. ఈనే తల్లికి సరైన బలం లేనప్పుడు,
తొలి ఈనికలప్పుడు
పెయ్యలలోనూ సకాలంలో సరైన వైద్య సహాయం అందనిపక్షంలో దూడలు చనిపోయి గర్భంలో ఉండగానే ఉబ్బిపోతాయి.
పశువైద్యుని పర్యవేక్షణ
అవసరం
ఈనిక ఆలస్యం అయితే దూడ ఒత్తిడికి
గురై చనిపోతుంది.
సకాలంలో స్పందించినట్లైతే సమస్యను పరిష్కరించి
దూడ చనిపోకుండా
కాపాడే అవకాశముంటుంది.
గర్భకోశ ముఖద్వారం
విచ్చుకోనప్పుడు లేదా సంకోచవ్యాకోచాలు చాలినంతగా
లేనప్పుడు దానికి తగిన మందులను ఎక్కించినట్లయితే కాన్పు సులభమవుతుంది.
గర్భసంచి మెలితిరిగినట్లయితే దానిని తిరిగి యధాస్థానానికి వచ్చేలా చేసేందుకు
అవసరమైతే తల్లి పశువును పిల్లి మెగ్గలు వేయించాల్సి ఉంటుంది. ఇలాంటివి పశు వైద్యుని పర్యవేక్షణలోనే
జరిపించాలి. దూడ సక్రమమైన రీతిలో లేక తల, కాళ్లు మడతపడిగాని,
వెనుక కాళ్లు ముందుగా వచ్చే పరిస్థితిగాని
ఉంటే వాటిని తగిన విధంగా సవరించి, దూడ బయటకు రావడానికి
అవసరమైన చర్యలు చేపట్టాలి. ఇలాంటి చర్యలతో సమస్య పరిష్కారం కాని సందర్భాల్లో శస్త్రచికిత్స చేసి దూడను బయటకు తీయాల్సి ఉంటుంది.
రైతులు గమనించాల్సిన
ముఖ్య విషయాలు
చూడి గేదెలను మిగతా పశువుల నుండి వేరు చేసి, గాలి వెలుతురు సక్రమంగా ఉండే చోట ఉంచాలి. చూడి పశువు మలుగులు దింపి, తీగలు వేయటం ప్రారంభించిందంటే ఈనికకు సిద్ధమైనట్లుగా
గ్రహించి దానిని ఎల్లప్పుడు గమనిస్తూ ఉండాలి.
దెబ్బతగిలి కటిప్రాంతం
కుంచించుకుపోయిన పశువులను చూలి కట్టించకపోవడం మంచిది. లేదా చిన్న, బరువు తక్కువగా ఉన్న పోతుతో కలపాలి. ఇలాంటి పశువు ఈనేటప్పుడు పశువైద్యుని పర్యవేక్షణ
తప్పనిసరి. అవసరమైతే శస్త్ర చికిత్స ద్వారా దూడను తీయాల్సి ఉంటుంది.
చూడి పశువులకు మంచి పోషక విలువలు కలిగిన దాణాతో పాటు ఖనిజ లవణ మిశ్రమాన్ని
కూడా అందించాలి.
చివరి రెండు మూడు నెలల చూడి పశువుకు అదనంగా మరో రెండు కేజీల మంచి పోషక విలువలు కలిగిన దాణా మిశ్రమాన్ని ఇవ్వాలి.
ఈనడానికి సిద్ధమై పలుమార్లు అసహనంగా పడుకుని లేస్తూ ఉండే పశువు రెండు గంటలకు పైబడి ఈనలేకపోయినట్లైతే పశువైద్యుడిని
సంప్రదించాలి. జత కలిపే సమయంలో మగపశువు ఆడపశువుకు సరైన జోడిగా ఉండేలా చూసుకోవాలి. మరీ పెద్దపోతుతో దాటించొద్దు.
|
|